27, ఫిబ్రవరి 2014, గురువారం

ఓం నమః శివాయ

ఓం నమః శివాయ


ఓం నమః శివాయ ఓం నమః శివాయ
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా

పంచభూతములు ముఖపంచకమై
ఆరుఋతువులూ ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసమ్ములై  
తాపసమందార నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయ    

త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి ఋత్విజ వరులై
అద్వైతమే నీ ఆదియోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ

25, జనవరి 2014, శనివారం

వేటూరి గీత పంచకం #2

వేటూరి గీత పంచకం #2

[ జనవరి 29 వేటూరి పుట్టినరోజు ని పురస్కరించుకొని అందిస్తున్నచిరుప్రయత్నం ]

 పౌరాణికం - కిరాతార్జునీయం 

తకిట తక తకిట జటిత పదయుగళా - హరహర మహాదేవ అభయంకరా
అని దేవతలు శివుని కొనియాడగా  - పరవశమ్మున శివుడు తాండవమాడగా  
కంపించెనంతలో కైలాసమా వేళ 
కనిపించెనంత అకాల ప్రళయ జ్వాల
జగములేలే వాని సగము నివ్వెరపోయె
సగము మిగిలిన వాని మొగము నగవై పోయె

ఓం నమశ్శివాయ 

అతడే అతడే అర్జునుడు - పాండవ వీర యశోధనుడు
అనితరసాధ్యము పాశుపతాస్త్రము కోరి ఇంద్రగిరి చేరి
శివునికై అహోరాత్రములు  చేసెను తపస్సు 
ఇది సృష్టించెను దివ్య మహస్సు

నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె
తలపైని గంగమ్మ తలపులోనికి పారె
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకారధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

శివుని ఆనతిని శిరమున దాల్చి - మూకాసురుడను రాక్షసుడు
వరాహరూపమ్ము ధరించి వచ్చెను - ధరాతలమ్మే అదిరిపోవగా 

చిచ్చరపిడుగై వచ్చిన పందిని - రెచ్చిన కోపముతో 
అర్జునుడు మట్టుపెట్టగా పట్టె బాణము - తనూ ఒక చేతను అందుకొని
చూసిన కంటిని చూడకనే గురి చూసినంతనే, వేసినంతనే
తలలు రెండుగా బిలబిల లాడుచు , తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటు ఇటు తగిలిన రెండు బాణముల అశువులు వీడెను వరాహము

కొట్టితి నేనని అర్జునుడు పడగొట్టితి నేనని శివుడు 
పట్టిన పట్టును వీడకనే తొడగొట్టిన వీరముతో అపుడు

వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది       
మేటి తగవు పొమ్మని విలుమీటి పలికె శివుడు
చేవ నాది చేత నాది చేటెరుగని  ఈటె నాది
చేవుంటే రమ్మని కనుసైగ చేసె అర్జునుడు

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించె అర్జునుడు,
కానీ, అపుడతడు వేయి చేతుల కార్తవీర్యార్జునుడు 
ఓంకార ఘనధనుష్టంకారములతోడ శరపరంపర కురిసె హరుడు
అయినా, నరునికాతడు మనోహరుడు

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధివిలాసమేమొ  పెట్టిన గురి వట్టిదాయె
అస్త్రములే విఫలమాయె శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడిఎడమై సంధించుట మరచిపోయే

జగతికి సుగతిని సాధించిన తల - దిగంతాలకవతల వెలిగే తల
గంగకు నెలవై కలకాదరువై హరిబ్రహ్మలకు తరగని పరువై
అతిపవిత్రమై అఘలవిత్రమై, శ్రీకరమై శుభమైన 
శివుని తల అదరగా, సృష్టి చెదరగా

తాడి ఎత్తు గాండీవముతో ఉత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండ కోపమున  కొట్టినంతనే

తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

కిరాతార్జునీయం

ఈ పాటను వ్యాఖ్యానించాలి అనుకున్నంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. నేను చేయగలిగింది పరిచయం మాత్రమే. పాటంతా అలతి అలతి పదాలతో, భారవి (సంస్కృత కిరాతార్జునీయం) , శ్రీనాథుడు (హరవిలాసం), ధూర్జటి (శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం) మొదలైన మహాకవులు వర్ణించిన ఘట్టాన్ని అతి రమణీయంగా , అబ్బురపరిచే శబార్ధపాండిత్యం తో అద్భుతమైన పాట రాసాడు వేటూరి.

అర్ధం సులభగ్రాహ్యమే. ఇందులో కొన్ని మంచి చమత్కారాలు : (నిజానికి పాటంతా శబ్దాలంకారాలే  )

"జగములేలే వాని సగము నివ్వెరపోయె సగము మిగిలిన వాని మొగము నగవై పోయె" శివుడు పార్వతీ అర్ధనారీశ్వరులని ప్రతీతి. శివుడు లోకేశ్వరుడు. అర్జునుని తపోవహ్నికి ప్రపంచం అల్లల్లాడగా, ఆ శివుడి సగం (పార్వతి) చకితురాలైందిట, మరి శివుడో ? ఆటను సగమే మిగిలాడు కదా, అతని మొగము (ముఖము) నగవైపోయే (నవ్వుమయమయిపోయిందిట )

జగము / సగము / మొగము / నగవు అంటూ అచ్చ తెలుగు పదాల ప్రాసతో ఎంతో చక్కని ఉత్ప్రేక్షని వర్ణించాడు కవి.

"నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె"; "నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె"    ఈ ప్రయోగాలు scenicగా బాపు మార్కు picturization కి తగినట్టుగా అమిరాయి.

అన్నిటి కంటే గొప్ప ప్రయోగం "ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మారగా" ఎఱుక- జ్ఞానము కల్గిన శివుడు "ఎఱుకగా" కిరాతరూపం ధరించగా ... ఒకే శబ్దానికుండే రెండు అర్ధాలతో, అలంకారాలు ఆపోసన పట్టిన వేటూరి మహత్తరంగా రాసిన మాట ఇది. అన్నీ తెలిసిన శివుడు, మోక్ష స్వరూపమైన శివుడు  తెలిసి తెలిసీ , ఒక బోయవాడి రూపం ధరించాడు. ఎందుకు ? భక్తుడి కోసం.

చిచ్చర పిడుగు - రెచ్చిన కోపం;
 వేట నాది - వేటు నాది; 
చేత నాది చేయి నాది  చేటెరుగని  ఈటె నాది; (పరాజయం తెలియని ధనుస్సు నాది)                     
అర్జునుడు - కార్తవీర్యార్జునుడు ; 
హరుడు - మనోహరుడు; 
ఓంకార-ధనుస్టంకార ; 
అతిపవిత్రమై అఘలవిత్రమై;
తల అదరగా - సృష్టి చెదరగా ; 
ఎదుట - ఎదలో;

ఈ ప్రయోగాలు వేటూరి ప్రాస ప్రియత్వాన్ని పట్టి ఇస్తాయి.

మరో అందమైన మాట "తల్లిదండ్రుల చలువ తనువైన దేవుడు". ఇది బహుశా ఈ పాటలో పరమాద్భుత ప్రయోగం.
తల్లిదండ్రుల ప్రేమ స్వచ్చమైనది . అలాంటి ప్రేమయే తనువైన (శరీరమైన) దేవుడుట శివుడు . ఆహా ఏమి వర్ణన ? దేవుని కరుణకి ఇంత అందమైన నిర్వచనం ఎవరైనా చెప్పారా ?

తమిళ శైవసిద్ధాంతంలో "అన్బేశివం" అనే మాట ఉందిట. అంటే "ప్రేమయే శివుడు" అని. ఆ భావస్ఫూర్తి మనకిక్కడ కనిపిస్తుంది.

"ఎదుట నిలిచెను శివుడు ఎదలోని దేవుడు" - ఇది వేటూరి మార్కు ప్రయోగం. ఇలాంటి ప్రయోగమే పంతులమ్మ సినిమాలో ఉంటుంది "ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు , ఎరుగని వారికి ఎదటే ఉన్నాడు " అని.

ఎదలోని శివుడు ఎదటే కనబడితే ? - పదములంటెను నరుడు . అంతేనండీ, అంతకంటే ఏంచెయ్యగలడు. మనము కూడా ఇంత గొప్ప వేటూరిని తెలుగు వారికి అందించినందుకు ఆ శివుడి పాదాలకు నమస్కరిద్దాము.     

                                   
                                 

     
      
     
    

24, జనవరి 2014, శుక్రవారం

వేటూరి గీత పంచకం #1

వేటూరి గీత పంచకం #1

[ జనవరి 29 వేటూరి పుట్టినరోజు ని పురస్కరించుకొని అందిస్తున్నచిరుప్రయత్నం ]

సంప్రదాయకవిత్వం - చైత్రము కుసుమాంజలి

బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు
దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు
భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి
నృత్యాంజలి నాట్య కోవిద వరులకు 

శుభము శుభము సాహిత్య పరులకు
శుభము శుభము సంగీత విదులకు
శుభము శుభము నాట్యానుమోదులకు
శుభము శుభము సర్వ జనాళికి   

చైత్రము కుసుమాంజలి, (2) 
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి

వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే ............ నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికి       

శయ్యలలో కొత్త వయ్యారమొలికే  
శరదృతుకావేరి లా తీగ సాగి
హిమజల పాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి
చలి ఋతువే, సరిగమలౌ నాద సుధా మధువనికీ     

చైత్రము కుసుమాంజలి   

సంప్రదాయ సాహిత్యాన్ని కాచివడబోసిన వేటూరి, పూర్వ కవుల మార్గాన్ని అనుసరిస్తూ ఋతువర్ణన చేసిన అద్భుతమైన పాట ఇది.నవ్వులకు మారుపేరైన జంధ్యాల తనకు అత్యంత ఇష్టమైన పాట అని చెప్పిన పాట ఇది.

సన్నివేశం ఊరు వెలివేసిన నాట్యకారుడు తన శిష్యురాలైన దొమ్మరి పిల్లకి పాఠం నేర్పటం.
మొదట ప్రార్ధన:  

"బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు" -  తాండవానికి ఆద్యుడైన పరమేశ్వరుడికి బ్రహ్మాంజలి.
నిరంతరమూ లాస్యంలో మునిగితేలే పార్వతీ దేవికి దివ్యమైన నమస్కారం "దివ్యాంజలి లాస్య ఖేలనా లోలకు"  

నాట్యం కేవలం కళ కాదు , అది పార్వతీపరమేశ్వరుల ప్రతిరూపం. తాండవ నృత్య స్రష్టకు అనటం లో 

ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాగ్మయం
ఆహార్యం చంద్ర తారాది, తమ్ వందే "సాత్వికం శివం"  అన్న శ్లోకస్ఫురణ ఉంది.

ఇదే భావాన్ని వేటూరి సాగరసంగమంలో "చంద్రకళాధర, సహృదయా, సాంద్రకళాపూర్ణోదయా " అని వర్ణించారు.
కళోపాసన ఈశ్వరస్వరూపం అని మన పూర్వుల అభిమతం.

ఈ నృత్య కళకు (కూచిపూడికి) ఆద్యుడైన సిద్ధేంద్రయోగికి నమస్కారం - "భక్త్యంజలి సిద్ధయోగీంద్ర సత్కవికి"  

కళని ప్రదర్శించే వారుంటే, యుక్తాయుక్తాలు గ్రహించి మెచ్చుకునే రసికులు ఉంటారు  - "నృత్యాంజలి నాట్య కోవిద వరులకు "

విచ్చేసి ఆస్వాదించే కళాప్రియులందరికీ శుభము శుభము కలుగు గాక   "శుభము శుభము సర్వ జనాళికి"   అని ఆశీస్సులు అందించిన ఆ ఆచార్యుడు, ఈ ప్రకృతిలోని నృత్యరీతుల్ని తెలుపుతూ

"చైత్రము కుసుమాంజలి " - చైత్రఋతువు పువ్వుల దోసిలి నమస్కారమట. ఏమందం !!! ఏం చమత్కారం !!! ఋతువుని ఒక అభినయ ముద్రగా, ఒక expression కి symbolisation గా అభివర్ణించిన వారున్నారా వేటూరి తప్ప ?

ఆ చైత్రము ఎలాంటిదిట? "పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు పలికే మరందాల అమృత వర్షిణి" జాణలైన కోకిలలు విలాసంగా పంచమస్వరం లో తేనెలు అమృతాలు చిలకరించి పాడే అమృతవర్షిణి అట. చైత్రమాసంలో కోకిలలు కూయటం సహజం, ఆ సహజత్వo భావుకత ఉన్న వాడిలో ఇంత అందమైన రూపుకడుతుంది.

ఇంతకీ ఈ చైత్రం ఎవరికి కుసుమాంజలి ? అదే చెబుతున్నాడు 

వేసవి లో కార్చిచ్చులో పడిన పత్రాల్లా (అగ్నిపత్రాల్లా) మండిపోయే 
విరహతాపంతో ఉన్న నెచ్చెలి నిట్టూర్పులా సంచరిస్తూ, 

జలదుని (మేఘుని ) నినాదాలు మృదంగతాళ గతులలో ఎగయగా,
వర్ష సమాగమంలో పులకరించే జలగంగ లా ఆడే 

కళాభారతికి చైత్రము కుసుమాంజలిట. అంటే అటు విరహము, ఇటు సంభోగము రెండిటిలోనూ పరిపూర్ణత్వం, తాదాత్మ్యతా ప్రదర్శించే కళారూపానికీ, కళాకారుడికీ, ఇన్ని shades తనలో ఒద్దికగా దాచుకున్న ఈ ప్రకృతి అంతటా నిండిన ఈశ్వరవిభూతికి చైత్రo పూల దోసిలి పట్టిందట.

ఆహా !!! తనలో ఇన్ని కళలు నింపినవానికి కృతజ్ఞతయే ఋతువులు అన్న భావం ఎంత గొప్పది !!!

శరత్కాలంలో బురదతగ్గి "ఆకర్దమం" గా ఉన్నప్పుడు, ఒంపుసోంపు నడకల అందగత్తె లా కావేరి తుళ్ళుతూ ఉంటే, చలిలో మంచు బిందువులు మన్మధబాణాల్లా తగులుతూ ఉంటే, అతిధిగా వచ్చిన మరునికి ప్రీతిపూర్వకంగా స్వాగతమందజేసి, ఆ ఆనందంలో, తమకంలో ఆలాపనలతో నిండిన నాదసుధావనికి   చైత్రము నమస్కారమందిట 

తనను చూసి పులకించి రమించే రసికులకు ప్రక్రుతి తిరిగి నమస్కరిస్తుందట, ఆహా ప్రకృతికి ఎంత కృతజ్ఞత ?

కళని  నేర్చుకునే వేళలో ఇంత రమణీయంగా పాఠం చెబితే మనసు ఆర్ద్రమవదా?

కాళిదాస మహాకవి ఋతుసంహారం ప్రతిబింబించేలా అన్ని ఋతువుల్లోనూ శృంగారాది నవరసాలను దర్శించిన వేటూరి ఇదే హృదయాంజలి   
                                       
                                 


     
      
     
    

5, జనవరి 2014, ఆదివారం

పూసింది పూసింది పున్నాగ

పూసింది పూసింది పున్నాగ
కూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసే సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై (2)
ఆడ, జతులాడ 

ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
 కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే

అనుకోని రాగమే, అనురాగ దీపమై
వలపన్న గానమే, ఒక వాయులీనమై
పాడె  మది పాడె

పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కలలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆభేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే

అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసె విరబూసె

 
పూసింది పూసింది

"సరదా పాట" కి నిర్వచనం ఏంటి? ఈ పాటే . నిజానికి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేని పాట,
ఇందులోని కొన్ని విశేషాలు

పున్నాగ పువ్వు వేటూరి కీ చాలా ఇష్టమనుకుంటా తరచుగా ఆయన పాటల్లో వినిపిస్తుంది. (ఉదా: సిరిమల్లె నీవే - పంతులమ్మ సినిమా)

పున్నాగ పువ్వు కొంచెం నీలా నవ్వింది అనటం. నిజానికి అమ్మాయిలు నవ్వితే పువ్వులా నవ్వావు అంటారు, కానీ పువ్వే అమ్మాయిలా నవ్విందంటే, ఆ నవ్వు ఎంత అందంగా ఉందో ....

ఇష్టసఖి, అష్టపది,  నా చిలుకా, నీ పలుకే ... ఇటువంటి జంట పదాలతో  వేటూరి తనకి శబ్దాలంకారలంటే మక్కువ ఎక్కువ అని మరొక్క మారు నిరూపించుకున్నాడు.
కలిసొచ్చిన కాలాల కౌగిళ్ళలో కలలోచ్చాయిట ! కాల స్పర్శ కాదు , కౌగిలిలా చుట్టుముడితే, కలలు రావా ? వస్తాయి అవెంత అందంగా ఉంటాయో, ఏ ఏ కథలు చెప్తాయో ... ఈ భావన ఎంత బాగుందో  
  
ఎక్కడో అనుకోకుండా తగిలిన రాగం (ప్రేమభావన) ఒక బంధంగా మరలుతుంది, ఇది కేవలం ఒక భావుకుడు, ప్రేమికుడు మాత్రమే అనగలిగిన మాట.

నా పదం (పాదం) నీ పదాన్ని (కవితని ) పారాణి గా పెట్టుకుందిట ! పాదానికి పారాణే అందం , అదొక contrast, నీకు నాకు మధ్య ఉన్నవి differences కావు, contrasts అంతే. అది మనిద్దరికీ అందం అన్న పొందిక ఎంత poetic గా చెప్పాడో వేటూరి.

అరవిచ్చిన రాగాలు అంటే అవ్యక్తమైన భావాలు వ్యక్తం చేస్తున్న దశ, అప్పుడు ఉన్న "కృత్యాద్యవస్థ" నీ రాక వల్ల తీరిందని ఎంత సొంపుగా చెప్పాడు వేటూరి.

సరదా పాటలకి ఈ పాట ఒక textbook. అందమైన పదాలతో, ముగ్ధసౌందర్య పూరితమైన ఈ పాటకి m.m.కీరవాణి అద్భుతమైన సంగీతం అందించాడు.                    



21, డిసెంబర్ 2013, శనివారం

ఎవరికి తెలుసు చితికిన మనసు

వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం

ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ
ఆ చితి మంటల చిటపటలే నా లో పలికే కవితలనీ

ఎవరికి తెలుసు...

మనసుకి మనసే కరువైతే
మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ
నీడైనా దరి నిలువదనీ

జగతికి హృదయం లేదనీ  ఈ జగతికి హృదయం లేదనీ
నా జన్మకి ఉదయం లేనే లేదనీ                                            

ఎవరికి తెలుసు...

గుండెలు పగిలే ఆవేదనలో
శ్రుతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో
నిట్టూరుపులే సంగీతం

ప్రేమకు మరణం లేదనీ   నా ప్రేమకు మరణం లేదనీ
నా తోటకు మల్లిక లేనే లేదనీ

ఎవరికి తెలుసు...

ఎవరికి తెలుసు చితికిన మనసు

15, డిసెంబర్ 2013, ఆదివారం

ఇది నాదనీ, అది నీదనీ....

ఇది నాదనీ, అది నీదనీ, ఇది నాదనీ, అది నీదనీ,
చెప్పలేనిది ఒక్కటి ఈ ఒక్కటి , ఏమది ?
అది ఇది అని చెప్పలేనిది , ఆ చెప్పలేనిది ఏమది?
అది మనసున పుట్టి మమతల పెరిగి మధువై పూచేది
అది ఇది అని చెప్పలేనిది, అది ఇది అని చెప్పలేనిది

వెన్నెలమ్మ రాతిరిదా, వేకువమ్మ పొద్దుటిదా
కోకిలమ్మ ఆమనిదా?

ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత      
ఈ పువ్వు పులకరింత, ఈ పడక పలకరింత
ఈ జన్మకు చాలనంత పరవశమంతా
మనదే మన ఇద్దరిదే, పదే పదే వినిపించే ప్రియదేవుడి అష్టపది,  అది ఇది అని చెప్పలేనిది

మొగ్గిన వలపుల ముంగిటా, వయసు  ముగ్గు వేయనా
నిగ్గులు పొంగిన చెక్కిటా,  సిగ్గుల ఎరుపులు తాకనా
వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతీ
ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై మురిసే
పరవశమంతా మనదే మన "ఒక్కరిదే"
ఎదా ఎదా కలిపేసే ఇహపరాల ఇష్టపది
అది ఇది అని చెప్పలేనిది      

ఇది నాదనీ, అది నీదనీ,

8, డిసెంబర్ 2013, ఆదివారం

అన్నమయ్య గురించి వేటూరి

వేటూరి పాట :

నాకు తెలిసినంత వరకూ, పాటంటే అన్నమయ్య, తరవాత వేటూరి.
"అన్నమయ్య" అని రాసిన వాక్యంలోనే వేటూరి అని రాయడం (english లో చెప్పాలంటే taking annamayya's name in the same breath as veturi) సాహితీ పరులు, సినిమా పాటలని ఎరిగిన వారు నన్ను తప్పు పడతారని నాకు తెలుసు.

కాకపొతే, ఇది వారిద్దరూ సమానులని చెప్పటం కాదు.వారిద్దరి పాటాలూ నన్నాకర్షించాయి అని. మనలో చాలా మందికి రాముడూ ఇష్టమే , రామారావూ ఇష్టమే. అలాగని వారిద్దరని equate చేసినట్లా?

పోలిక ఎందుకు తెచ్చినా, సరైన పోలిక తట్టింది.రామారావు రాముడ్ని మనందరికీ గుర్తు చేసాడు. రాముడంటే ఇలాగే ఉంటాడని అనిపించాడు. కానీ, రాముడు కాని (అంటే వాల్మీకి రాముడు కాని) ఎన్నో పాత్రలనూ అంతే సుళువుగా, అంత కన్నా successfulగా పోషించాడు.

వేటూరి కూడా, అన్నమయ్య సాహిత్యం లో ఉండే లక్షణాలని నా వంటి వారికి పరిచయం చేసాడు, చదువుకున్న వారికి గుర్తుకు తెచ్చాడు. అదే శైలిలో మాత్రమె రాయకుండా, ఇంకా ఎన్నో భిన్నమైన, అందమయిన  పాటలూ, పాట అనడానికి అర్హతలేని ఎన్నో fill in the blanks చేసాడు.

రామారావు రాముడి గురించి ఏమన్నాడో మనకు తెలియదు. కానీ వేటూరి అన్నమయ్య గురించి ఏమన్నాడో మనకు తెలుసు. అదే ఈ పాట

తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

అరిషడ్వర్గము తెగనరికే, హరి ఖడ్గం ఇది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాస్శీస్సులు పొందినదై
శివలొకమ్మున చిద్విలాసమున డమరు ధ్వనిలో గమకితమై
దివ్య సభలలో భవ్య నాట్యముల పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి 
సితహిమ కంధర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించె ఆ నందకము - నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

పద్మాసనుడే ఉసురు పోయగా, పద్మావతియే పురుడు పోయగా,
విష్ణు తేజమై, నాదబీజమై, ఆంధ్ర సాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా ||

పాపడుగా నట్టింట పారుతూ భాగవతము చేపట్టెనయా
హరి నామమ్మును ఆలకించక అర ముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతౌ ఎదలయ లో పదకవితలు కలయ
తాళ్ళపాక లో ఎదిగే అన్నమయ తమసోమా జ్యోతిర్గమయా ||

అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసుకు రావటం లో ప్రముఖ పాత్ర వహించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తమ్ముడు కొడుకు అవటం వల్ల సుందరరామ్మూర్తి ఈ పాట ఇంత  గొప్పగా రాసాడా? అయ్యుండచ్చు. కానీ ఈ పాటని అన్నమయ్య scholar తమ్ముడి కొడుకుగా రాయలేదేమో అనిపిస్తుంది. తన పాటకులానికి తొలి గురువయిన వాడిపై తనది గొప్ప లేక చెప్పుకోతగ్గ  creativity అనే అహంభావాన్ని విడిచిపెట్టి, కేవలం, ఒక భక్తుడిగా , భక్తుడి భక్తుడి గా, ఒక పరిశీలకుడిగా అన్నమయ్య పాటలో , పలుకుబడిలో, భక్తిలో, భావనలో ఉన్న మాధుర్యాలకి కారణాలు వెతుకుతున్న ఒక సాహిత్య ఉపాసకుడిగా ఈ పాట రాశాడు వేటూరి.

అన్నమయ్య పాటలో ప్రతిభకీ వ్యుత్పత్తికీ ఉన్న అన్యోన్యత ఎలా వచ్చింది? లయ, గమకం ఎలా చేరింది? అతి లావణ్యమాయమైన కులుకూ, నిరంతరమూ హరి గానమే చేసే అనురక్తి, నాదశక్తి ఎలా సమకూరాయి? తపోవేదనా, ఆ వేదన లోంచి వచ్చే మంత్రం లాంటి మాట ఎలా వచ్చి కలిసాయి?

అన్నమయ్య విష్ణు మూర్తి ఖడ్గం అయిన "నందకం" అంటారు శ్రీవైష్ణవ సంప్రదాయము వారు. బహుశా ఆ ఖడ్గం భూమిపై అవతరించడానికి వస్తున్నప్పుడు సత్యలోకం గుండా వచ్చిందేమో, అందుకే సత్యలోకం లో ఉన్న బ్రహ్మాసరస్వతుల అనోన్యత ఆ ఖడ్గంలో ఒదిగిపోయింది. శివుడు అద్భుతంగా తాండవం ఆడుతుండగా అటుగా వస్తూ ఆ తాండవం లోని గమకం గ్రహించింది. ఇంద్ర సభలో నాట్య మాడుతున్న అప్సరసల కులుకులూ ఓడిసిపట్టిందేమో. హరిని  పొగడడానికే అవతరించిన నారదుల వారి మార్గాన పోతూ ఆ నారదుని హరి భక్తి, నాద స్ఫూర్తి గ్రహించిందేమో, హిమాలయ సిద్ధ భూములలో పరమాత్మ సందర్శనానికి పరితపించిన ఋషుల మనోభావాలు  అనుభూతి చెందింది. అయినా అది సహజంగా హరి ఖడ్గం. కామo , క్రోధo , లోభo  మోహo , మదo  మాత్సర్యం అనే లోపలి శత్రువులని తెగనరకటం దాని పని. అందుకే ఇన్ని అందాలను తనలో, తన కవిత్వంలో ఇముడ్చుకున్న మహానుభావునిగా జన్మనొందడానికి లక్కమాంబలోకి ప్రవేశించింది. ఆమె పుణ్య వనిత. అందుకే  ఆమెది గర్భాశయము కాదు గర్భాలయము!

అన్నమయ్య పుడుతుంటే ఎవరు పురుడు పోశారో? సాక్షాత్తు పద్మావతి దేవి, తనపై వయారంగా, చనువుగా శృంగార కీర్తనలు రాసే వాడిని ఈ లోకంలోకి తీసుకువచ్చిందేమో.
అది ఖడ్గం కాదు, విష్ణు తేజమే. ఒక్క సంకీర్తనే చాలు అనే రీతిలో వెలసిన 32 వేల సంకీర్తనల మహా కల్పతరువుకి నాదబీజం. (సంస్కృత భాషకి lexicon) అమరకోశం లాగా అన్ని పదాలనీ, అన్ని విషయాలనీ స్పృశిoచేది, ఆంద్ర భాషకు అమరత్వాన్ని కలిగించినది.

అన్నప్రాసన నాడు డబ్బులూ, పుస్తకం, కత్తి,  వంటివి పెట్టి ముచ్చట చేస్తే ఈ అన్నమయ్య ఏమి చేపట్టాడో? యితడు ప్రహ్లాదుడంతటి భక్తుడు!!! భాగవతం చేపట్టి ఉంటాడు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని అతి రమ్యంగా , రుచిగా చెప్పిన భాగవతం నా కీర్తనలకి మార్గదర్శకము అని అప్పుడే చెప్పాడా? ఈతడు తెలుగు సరస్వతికి ఆరిపోని హారతి. అతని గుండెసడిలో కూడా పదకవిత వెల్లువయ్యేలా అన్నమయ్య తాళ్ళపాక వారి భాగ్యమై, కాదు కాదు ఈ తెలుగు జాతినే అంధకారంలోంచి కాంతి లోకి, అజ్ఞానం లోంచి జ్ఞానం వైపుకి  నడిపించే మార్గమై వెలిసాడు.

అన్నమయ్య గురించి పాట అనగానే   ఇన్ని అనుభూతులు కదిలి రాసిన ఒక scribe లాగా, సమీక్షకుడి లాగా రాసిన వాడు వేటూరి. 

ఇంతటి గొప్ప పాట రాయగలిగే అవకాశం, superhit commercial director సినిమా లో రావటం ఒక విచిత్రం!
వేటూరి తెలుగు పాటని భ్రష్టుపట్టించాడనే  వారికి ఒక  ప్రశ్న. 1976 లో commercial పాట రాయను అని వేటూరి అనుంటే, 1996 లో ఈ పాట రాయగలిగే అవకాశం అతనికి
వచ్చేదా?

వేటూరి జన్మదినం సందర్భంగా   ఆయనలోని సాహిత్యారాధకునికి  ఇది నా నివాళి !!!

originally published in nksmind.blogspot.in on 29-01-2013