8, డిసెంబర్ 2013, ఆదివారం

చినుకులా రాలి...

చినుకులా రాలి, నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు, కడలి నేను మరిచిపోబోకుమా
మమత నీవె సుమా

చినుకులా రాలి, నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఒదార్పునే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటాను లే  
జన్మలు దాటే ప్రేమను నేనై నే వేల్లువౌతానులే
నీ నవ్వులే చాలులే

హిమములా రాలి సుమములై పూచి ఋతువులై నవ్వి
మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ  నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిథిలమైనా  మరిచిపోబోకుమా
విరహమైపోకుమా

తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పూవులకోసం వేసారుతున్నాను లే  
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలి లే
తీరాలు చేరాలి లే

మౌనమై మెరిసి, గానమై పిలిచి
కలలతో అలిసి  గగనమై ఎగసి  నీ ప్రేమ, నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా , ప్రేమ మనమే సుమా

చినుకులా రాలి, నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ

చినుకులా రాలి

ప్రేమను గురించి సున్నితంగా , సహజంగా రాసిన అందమైన పాట.

జంధ్యాల సినిమాల్లో ప్రేమ గురించి అందమైన సన్నివేశాలు, గీతాలు ఉంటాయి. పైగా చిత్ర దర్శకుడికీ, కవికీ ఉన్న chemistry, rapport వల్ల కూడా కొన్ని పాటలు పండుతాయి. కే.విశ్వనాథ్ గారితో తరువాత, బహుసా జంధ్యాలతోనే అంత సాన్నిహిత్యం ఉందేమో, జంధ్యాల సినిమాల్లో వేటూరి పాటలు అద్భుతంగా ఉంటాయి.

ప్రేమ చిన్నగా సన్నగా మొదలై, స్పందనలతో, ఉప్పొంగి, ఉద్వేగమై, ఉద్రేకమై ప్రవాహమౌతుంది. అది ప్రేమించిన వారిని చేరుకునేందుకు , గంగలా పరవళ్ళు తొక్కుతూ సాగరం చేరే రీతిలో సాగుతుంది. నదికి గమ్యం, గమనం, సార్ధకత కూడా సముద్రమే. ఆ భావాన్నంతా ఎంతో అందంగా చిన్న చిన్న మాటలతో చెప్పారు వేటూరి.

నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ అనటంలో , నా ప్రేమ కి నువ్వు తప్ప వేరే ఉనికి, existence లేదనడానికి ఇంత చిన్న మాట వాడారు వేటూరి.

విరహం వేడిగాలి లా కొడుతుంటే, చల్ల చల్లని వెచ్చ వెచ్చని ఉషోదయం లా వచ్చి ఓదార్పు తేవాలి, అని అతనంటే
నీ కోసమే, నీ ప్రేమ కోసమని ఎదురుచూస్తాను ఎన్ని జన్మలైనా, అలాంటి ప్రేమ జన్మ జన్మాలకీ సరిపోనంత వెల్లువై నేనే నీ దరికి చేరతాను అని ఆమె అంటుంది.

తెలతెల వారుతునప్పుడు మంచు బిందువై పూవుల మీద మెరిసి, ఋతువులు వచ్చినంత సహజంగా తేనె లాంటి తీయని  ప్రేమని మనం శీర్ణమైపోయినా మరిచిపోకూడదు, కలిసి బతకాలి, కలిసి మట్టిలో కలిసిపోవాలి కానీ విరహం మాత్రం రానివ్వకూడదు.

వయసులో తోడు కోసం, స్నేహం కోసం ఎంతో ఎదురుచూస్తాము. అది సున్నితమైనది, దాని కోసం పడే తపన తీయనిది, ఆ తపనని ఎంతో అద్భుతంగా "అల్లాడుతున్నానులే" అని "వేసారుతున్నానులే" అని స్త్రీ తన బాధ చెప్పుకుంటే, నింగి నేలా కలిసి ముద్దాడుకున్న పొద్దులో, పున్నమి నీడలో నీ ఆత్రత, ఆరాటం తీరుస్తాను అని అతను ఊరిస్తాడు.

ఇంత ప్రేమ పండిపోయిన వారికి మాటలు అక్కర్లేదు (ఈ మాట వచ్చే చోట Those who love tell each other a thousand things without talking అనే posterచూబించారు) , మౌనమే వారి గానమై కలలు కంటూ అలిసిపోయి, ఆ కలల రెక్కల మీద గగనపు అంచుల దాకా ఎగిరే వారి ప్రేమకి, ఇహమైనా పరమైనా చావు లేదు. అది శాశ్వతం.

ఇటువంటి రసవంతమైన పాట అందించిన వేటూరికి మనం ఏమివ్వగలం. ఇంత మంచి పాటను రూపకల్పన చేసిన జంధ్యాలకి ఏమివ్వగలం ?!?!?!    
        

          












1 కామెంట్‌: